Saturday, October 10, 2026

Top 5 This Week

Related Posts

500 కోట్ల భూమి హాంఫట్‌.. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని విలువైన స్థలంపై పెద్దల కన్ను- PARAHUSHAR NEWS

రాజధాని నగరం నడిబొడ్డున ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఉన్న మూడున్నర ఎకరాల భూమిని ప్రైవేట్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 35 ఏండ్లుగా ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ఫెడ్‌ ఆధీనంలో భద్రంగా ఉన్న ఆ భూమికి ఇప్పుడు రెక్కలొస్తున్నాయి. విలువైన సర్కార్‌ భూములను చెరబట్టడమే పనిగా పెట్టుకున్న ‘ముఖ్యనేత’ ముఠా కన్ను ఇప్పుడా భూమిపై పడింది.


500 కోట్ల భూమి హాంఫట్‌.. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని విలువైన స్థలంపై పెద్దల కన్ను
  • 500 కోట్ల విలువైనభూమిని 87కోట్లకే
  • 15,445 sq yards ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టేందుకు సిద్ధం
  • గజం 3 లక్షలు పలికేచోట ప్రైవేట్‌కు 56 వేలకే
  • మూడున్నర ఎకరాలు అప్పనంగా కొట్టేసేందుకు స్కెచ్‌
  • కోర్టు సూచనను అనుకూలంగా మలుచుకొని ప్లాన్‌
  • ముఖ్యనేత ఆఫీస్‌ ఆదేశాలతో జెట్‌ స్పీడ్‌తో కదలిక
  • నెలన్నర కాలంలోనే దాదాపుగా పూర్తయిన పని
  • 35 ఏండ్లుగా ఆయిల్‌ ఫెడ్‌ ఆధీనంలో ఉన్న భూమి
  • భూమిని తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్న ఆయిల్‌ఫెడ్‌
  • ఆ సంస్థకు కనీస సమాచారం ఇవ్వకుండానే ప్రాసెస్‌
  • పట్టించుకోని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

కొమ్మిడి స్వామిరెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : రాజధాని నగరం నడిబొడ్డున ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఉన్న మూడున్నర ఎకరాల భూమిని ప్రైవేట్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 35 ఏండ్లుగా ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ఫెడ్‌ ఆధీనంలో భద్రంగా ఉన్న ఆ భూమికి ఇప్పుడు రెక్కలొస్తున్నాయి. విలువైన సర్కార్‌ భూములను చెరబట్టడమే పనిగా పెట్టుకున్న ‘ముఖ్యనేత’ ముఠా కన్ను ఇప్పుడా భూమిపై పడింది. ఇంకేముంది.. అక్షరాలా రూ.500 కోట్లకుపైగా విలువ చేసే స్థలాన్ని కేవలం రూ.87 కోట్లకే కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చివరిదశకు చేరుకున్నాయి. ‘ముఖ్యనేత’ కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లడంతో ఫైల్‌ చకచకా సిద్ధమై, జెట్‌ స్పీడ్‌తో కదులుతున్నదని అధికార వర్గాలు తెలిపాయి. కేవలం నెలన్నరలోనే ఫైల్‌ తుది అంకానికి చేరడమే ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు. మొత్తంగా రూ.500 కోట్ల భూమిని ఓ ప్రైవేట్‌ సంస్థకు బంగారు పల్లెంలో పెట్టి ఇవ్వడం లాంఛనంగా మారిందని అధికారులు చెప్తున్నారు.

ఇదీ ఆ భూమి కథ

ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో ఆజామాబాద్‌ ఇండస్ట్రీ ఉన్నది. బస్‌ భవన్‌ ఎదురుగా, బావర్చి హోటల్‌ పక్కన ప్లాట్‌ నం.1లోని ఆజామాబాద్‌ ఇండస్ట్రీకి చెందిన సుమారు 4 ఎకరాల భూమిని ఉమ్మడి ఏపీలో నాటి ప్రభుత్వం ‘దయారం సూరజ్‌ మాల్‌ లోహితి ఆయిల్‌మిల్స్‌’ కంపెనీకి లీజుకు ఇచ్చింది. అయితే ఆ సంస్థ లీజు నిబంధనలను అతిక్రమించి ఇతర కంపెనీలకు సబ్‌లీజుకు ఇచ్చినట్టు ప్రభుత్వం గుర్తించింది. లీజును రద్దు చేసింది. వెంటనే ఆ భూమిని ఏపీ ఆయిల్‌ఫెడ్‌కు (ప్రస్తుతం తెలంగాణ) అప్పగిస్తూ 1991లో నిర్ణయం తీసుకున్నది. దీనిపై సదరు ప్రైవేట్‌ సంస్థ కోర్టులను ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టులోనూ ప్రైవేట్‌ సంస్థకు వ్యతిరేకంగానే తీర్పు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. తనిఖీలు చేసే సమయానికి సదరు సంస్థ ఆధీనంలో ఎంత భూమి ఉంటే అంత భూమితోపాటు అప్పటికే సబ్‌ లీజ్‌ రద్దు చేసిన భూమి మాత్రమే సంస్థకు దక్కుతుందని, మిగిలిన భూమి ప్రభుత్వానికేనని స్పష్టంగా తీర్పు ఇచ్చినట్టు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సదరు ప్రైవేట్‌ సంస్థకు కేవలం 1,277 గజాలు మాత్రమే దక్కుతుంది. దీంతో మిగిలిన భూమి మొత్తం ఆయిల్‌ఫెడ్‌ ఆధీనంలోకి వచ్చింది. అలా 35 ఏండ్లుగా ఆ భూమి ఆయిల్‌ఫెడ్‌ ఆధీనంలోనే ఉన్నది. ఈ భూమిలో ఆయిల్‌ ఫెడ్‌ తన వ్యాపార కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నది. ఇందుకు పన్నులు కూడా చెల్లిస్తున్నది.

ప్రైవేట్‌కు కట్టబెట్టిన చంద్రబాబు

భూమి చేజారినా సదరు ప్రైవేట్‌ సంస్థ యాజమాన్యం దాన్ని దక్కించుకునేందుకు పైరవీలు ఆపలేదు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత, పదవీ ముగిసే సమయంలో ఆ ప్రయత్నాలు ఫలించాయి. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా, అంతకుముందు ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులను పక్కనపెట్టి ఏకపక్షంగా ప్రైవేట్‌ సంస్థకు 2003లో మళ్లీ లీజు పునరుద్ధరించారు. 12 ఏండ్ల తర్వాత నోటిఫికేషన్‌ లేకుండా, కోర్టు, ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా కట్టబెట్టడంపై అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఉత్తర్వులపై 2003 లోనే ఆయిల్‌ఫెడ్‌ హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ వివాదం కోర్టుల్లోనే ఉన్నది.

అడ్డుకున్న బీఆర్‌ఎస్‌

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కొలువుదీరిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పారిశ్రామిక భూములపై సమీక్షించింది. ఇందులో భాగంగానే ఆజామాబాద్‌ భూములపైనా రివ్యూ చేసింది. 2003లో ప్రైవేట్‌ కంపెనీకి మళ్లీ లీజు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయని గుర్తించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పరిశ్రమల శాఖ నుంచి ప్రైవేట్‌ సంస్థకు, ఆయిల్‌ఫెడ్‌కు 2015లో నోటీసులు జారీ అయ్యాయి. 2003లో ఇచ్చిన లీజు ఉత్తర్వులను ఎందుకు రద్దు చేయొద్దు? దీనిపై ఎందుకు పున:సమీక్ష చేయొద్దో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నది. వీటిపై సదరు ప్రైవేట్‌ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. వివాదాస్పద భూమిపై 2003లో ఆయిల్‌ఫెడ్‌, 2015లో ప్రైవేట్‌ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారించి, ఇటీవల తీర్పు ఇచ్చింది. ‘ఈ భూమిపై ప్రభుత్వమే చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలి’ అని సూచించింది. అంతే.. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది.

‘తగిన నిర్ణయం’తో.. రంగంలోకి ముఖ్యనేత ముఠా

హైకోర్టు ఇచ్చిన ‘తగిన నిర్ణయం’ ఉత్తర్వులను ఆసరాగా చేసుకొని మొత్తం భూమిని కొల్లగొట్టేందుకు ప్లాన్‌ వేశారని పరిశ్రమల శాఖ వర్గాలు చెప్తున్నాయి. సదరు ప్రైవేట్‌ కంపెనీ మళ్లీ పైరవీలు మొదలు పెట్టిందని, వారికి ప్రభుత్వ పెద్దలు, అధికారులు తోడయ్యారని పేర్కొన్నాయి. ఈ ప్రైవేట్‌ కంపెనీ వెనుక ‘ముఖ్యనేత’ ముఠా ఉన్నదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే హైకోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే ముఖ్యనేత కార్యాలయం నుంచి పరిశ్రమల శాఖకు ఫోన్ల పరంపర కొనసాగినట్టు తెలిసింది. దీంతో పరిశ్రమల శాఖ నుంచి ఫైళ్లు ఆగమేఘాలపై కదలడం మొదలైందని, కేవలం నెలన్నరలోనే అన్ని శాఖలూ తిరగడం, సర్వే పూర్తి కావడం, భూమిని పంచడం, ఉత్తర్వులు ఇవ్వడం, ప్రైవేట్‌ సంస్థ డబ్బులు చెల్లించడం ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రైవేట్‌కే మూడున్నర ఎకరాలు

ఈ స్థలంలో అధికారులు సర్వే చేసినప్పుడు 17,261 గజాల్లో ప్రైవేట్‌ కంపెనీ సుమారు 2 వేల గజాల్లో షెడ్లు, వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని, 1,816 గజాలు ఆయిల్‌ఫెడ్‌ స్వాధీనంలో ఉన్నట్టుగా గుర్తించారు. మిగతా సుమారు 13,211 గజాలు ఖాళీగా ఉన్నట్టు తేల్చారు. ముందస్తు దోపిడీ కుట్ర అమల్లో భాగంగా అధికారులు ప్రైవేట్‌ సంస్థపై అతి ప్రేమను ఒలకబోసినట్టు సమాచారం. వాస్తవానికి మొత్తం స్థలాన్ని ఆయిల్‌ఫెడ్‌కు కేటాయించాలి. లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కొన్ని షరతుల మేరకు ప్రైవేట్‌ సంస్థకు కొంత భూమిని కేటాయించాలి. కానీ ఇక్కడ పూర్తి విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారు. మొత్తం స్థలంలో సింహభాగాన్ని ప్రైవేట్‌ సంస్థ ఖాతాలో వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు సర్వే చేసిన 17,261 గజాల స్థలంలో 15,445 గజాలను ప్రైవేట్‌ సంస్థకు, కేవలం 1,816 గజాలను ఆయిల్‌ఫెడ్‌కు కేటాయించారు. ఇక్కడ అధికారులు ‘జీ హుజూర్‌’ అంటూ తీవ్రస్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం విస్తీర్ణంలోని ఖాళీ స్థలాన్ని ప్రైవేట్‌ సంస్థ ఖాతాలో జమ చేశారని చెప్తున్నారు. తద్వారా ఖాళీ స్థలం 13,211 గజాలతోపాటు సంస్థ స్వాధీనంలో ఉన్న స్థలం కలిపి ప్రైవేట్‌ సంస్థకు 15,445 గజాలు కేటాయించారు. ఆయిల్‌ఫెడ్‌కు ఓ మూలన ముక్క 1,816 గజాలను మాత్రమే కేటాయించారు.

01

ప్రైవేట్‌పై ప్రేమ.. ఆయిల్‌ఫెడ్‌కు ధోకా

భూమి పంపకం, కేటాయింపులో పరిశ్రమల శాఖ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదని ఆయిల్‌ఫెడ్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఉత్తర్వులు ఇవ్వడం నుంచి మొదలుకొని సర్వే చేయడం, స్థలం విభజించడం, కేటాయించడం.. ఇలా ఏ దశలోనూ ఎక్కడా ఆయిల్‌ఫెడ్‌ను సంప్రదించలేదని విమర్శిస్తున్నాయి. కనీసం జాయింట్‌ సర్వే సయమంలోనూ ఆయిల్‌ఫెడ్‌కు సమాచారం ఇవ్వలేదని సమాచారం. ‘ఈ స్థలం విభజించాం.. డీమార్కేషన్‌ చేశాం. మీకు కేటాయించిన స్థలం వివరాలు ఇవిగో’ అంటూ పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ నుంచి లేఖ వచ్చేవరకు ఆయిల్‌ఫెడ్‌ అధికారులకు ఈ విషయం తెలియదట! దీంతో ప్రైవేట్‌ సంస్థతో అంటకాగుతూ ప్రభుత్వ సంస్థను పక్కన పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 35 ఏండ్లుగా స్థలాన్ని కాపాడుతున్న ఆయిల్‌ఫెడ్‌కు కనీస సమాచారం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకోవడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థలాన్ని ఏకపక్షంగా ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టేందుకు జరుగుతున్న కుట్రకు ఇది కూడా ఒక ఉదాహరణగా పేర్కొంటున్నారు.

రూ.87 కోట్లకే అప్పగింత

స్థలాన్ని విభజించి, కేటాయించిన అనంతరం పరిశ్రల శాఖ ఈ భూమిని ఫ్రీహోల్డ్‌ హక్కుల కోసం రూ.87.44 కోట్లు చార్జీగా నిర్ణయించింది. వీటిని చెల్లించాలని సూచిస్తూ మే 26న పరిశ్రమల శాఖ డిమాండ్‌ నోటీసు జారీ చేసింది. అప్పటికే సిద్ధంగా ఉన్న ప్రైవేట్‌ సంస్థ యాజమాన్యం తొలిదశగా రూ.8.74 కోట్లు చెల్లించింది. స్థలాన్ని హ్యాండోవర్‌ చేయడంతోపాటు సేల్‌ రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ వినతిపత్రం ఇచ్చింది. వాస్తవానికి ఆ స్థలానికి చార్జీలు చెల్లించేందుకు ఆయిల్‌ఫెడ్‌ సైతం సిద్ధంగా ఉన్నది. ఇందుకు సంబంధించి గతంలోనే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. కానీ ప్రస్తుతం ప్రైవేట్‌కు డిమాండ్‌ నోటీసులు జారీ చేసిన పరిశ్రమల శాఖ అధికారులు ఆయిల్‌ఫెడ్‌కు ఎలాంటి డిమాండ్‌ నోటీసులు జారీ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆయిల్‌ఫెడ్‌కు డిమాండ్‌ నోటీసు ఇస్తే ఆ సంస్థ డబ్బులు చెల్లిస్తే, మళ్లీ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే నోటీసు ఇవ్వలేదని తెలిసింది.

‘అప్పనంగా అర్పణం’ వెనుకున్నది ఎవరు?

ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో గజం భూమి ధర కనీసం రూ.3 లక్షలకుపైగా ఉంటుందని మార్కెట్‌ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వం ప్రైవేట్‌ సంస్థకు 15,445 గజాలు కట్టబెడుతున్నది. అంటే ఈ భూమి విలువ దాదాపు రూ.460-500 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నాయి. కానీ ప్రభుత్వం సదరు ప్రైవేట్‌ సంస్థకు గజం కేవలం రూ.56,617 కే కట్టబెడుతుండటం గమనార్హం. ఇందులో భాగంగానే 15,445 గజాలకు గానూ రూ.87.44 కోట్లు చెల్లించాలని ప్రైవేట్‌ సంస్థకు డిమాండ్‌ నోటీసు ఇచ్చింది. అంటే సుమారు రూ.500 కోట్ల స్థలాన్ని కేవలం రూ.87 కోట్లకే కట్టబెడుతున్నది. తద్వారా రూ.400 కోట్ల వరకు కొల్లగొట్టేందుకు ప్లాన్‌ వేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ సంస్థ ఒంటరిగా ఈ స్థాయిలో పైరవీ చేయడం సాధ్యం కాదని స్పష్టం, దీని వెనుక ముఖ్యనేత ముఠా ఉన్నట్టు పరిశ్రమల శాఖలో చర్చ జరుగుతున్నది.

వ్యవసాయ మంత్రికి పట్టింపు లేదా?

ఆయిల్‌ఫెడ్‌ ఆధీనంలో ఉన్న విలువైన భూమి అన్యాక్రాంతం అవుతుంటే, ఏకపక్షంగా ప్రైవేట్‌కు ధారాదత్తం చేస్తుంటే ఇటు ఆయిల్‌ఫెడ్‌ అధికారులు, అటు వ్యవసాయ శాఖ ఏం చేస్తున్నదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకింత మొద్దు నిద్రలో ఉన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు ఆ స్థలంలో సర్వే చేస్తున్నా ఆయిల్‌ఫెడ్‌ అధికారులకు తెలియదా? లేక తెలియనట్టు నటిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. తరచూ ఆయిల్‌పామ్‌ అనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఈ వ్యవహారాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్న తలెత్తుతున్నది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని ఆయిల్‌ఫెడ్‌ భూమిని తిరిగి తీసుకునేందుకు చర్యలు చేపట్టాలని, మంత్రి జోక్యం చేసుకోవాలని, ప్రభుత్వంతో మాట్లాడి ఆయిల్‌ఫెడ్‌ భూమిని రక్షించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

సమాచారం ఇవ్వలేం : తహసీల్దార్‌ సంధ్యారాణి

ఈ వివాదానికి సంబంధించి ‘నమస్తే తెలంగాణ’ హిమాయత్‌ నగర్‌ తహసీల్దార్‌ సంధ్యారాణిని ఫోన్‌లో సంప్రదించగా.. ఆమె స్పందిస్తూ ‘మాకు ప్రతిరోజూ ఎన్నో లెటర్లు వస్తుంటాయి. ఎన్నో సర్వేలు చేస్తుంటాం. అన్నీ గుర్తుంటాయా? అయినా ఆజామాబాద్‌కు సంబంధించి పరిశ్రమల శాఖ నుంచి లేఖ వచ్చింది. జాయింట్‌ సర్వే చేసి రిపోర్టు ఇచ్చాం’ అని సమాధానమిచ్చారు.

నేను కొత్తగా వచ్చా.. నాకేం తెలియదు : డీఐసీ గణేశ్‌ రామ్‌

హైదరాబాద్‌ డీఐసీ గణేశ్‌ రామ్‌ను వివరణ కోరగా.. ‘పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ ఆదేశాలతో ఆ భూమిపై చర్యలు తీసుకున్నారు. నేను కొత్తగా వచ్చాను. నెల రోజులు మాత్రమే అవుతున్నది. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు నాకు తెలియదు’అని పేర్కొన్నారు.

కాలం చెల్లిన జీవో అడ్డుపెట్టుకొని

ఆజామాబాద్‌ ఇండస్ట్రీ భూమిని ప్రైవేట్‌ సంస్థకు ఏకపక్షంగా కట్టబెట్టేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం 2023 ఆగస్టు 29న జారీ చేసిన జీవో-19ను సాకుగా చూపుతున్నది. దయారాం సంస్థకు భూమిని స్వాధీనం చేయడంతోపాటు ఫ్రీహోల్డ్‌ చేయాలంటూ ఈ ఏడాది మే 26న ఇచ్చిన జీవో 85లో ‘జీవో-19’ను సాకుగా చూపారు. దీంతో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

జీవో-19 అనేది మొత్తం ఆజామాబాద్‌ ఇండస్ట్రీ భూములను ఫ్రీ హోల్డ్‌ చేయడానికి ఇచ్చిన ఉత్తర్వులు. అంతేతప్ప ఒక్క దయారాం సూరజ్‌మాల్‌ కంపెనీ కోసం మాత్రమే ఇచ్చింది కాదు. ఒకవేళ ఆ జీవో ప్రకారం కేటాయింపులు జరిపితే, మిగతా వారికి కూడా చేయాల్సి ఉంటుంది. కానీ ఒక్క దయారాం కంపెనీపై మాత్రమే దయ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. 2023లో జారీ చేసిన ఈ జీవో గడువు గతంలోనే ముగిసిందని అధికారులు చెప్తున్నారు. ఈ జీవో కొనసాగిస్తున్నట్టు ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన దాఖలాల్లేవు. అలాంటప్పుడు చెల్లని, కాలం చెల్లిన జీవో ఆధారంగా ఎలా ఉత్తర్వులిస్తారనేది మరో ప్రశ్న. జీవో-19 కింద గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీహోల్డ్‌కు అవకాశమమిచ్చారు. ఒకవేళ దరఖాస్తు చేసుకోని పక్షంలో ఆ భూములను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందని పేర్కొన్నారు. దయారాం కంపెనీ అప్పుడు దరఖాస్తు చేసుకోలేదని, అలాంటి కంపెనీకి ఇప్పుడు స్థలం ఎలా కేటాయిస్తారనేది మరో ప్రశ్న.

జెట్‌ స్పీడ్‌తో తిరిగిన ఫైల్‌

  • ముఖ్యనేత కార్యాలయం ఆదేశాలతో ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని అత్యంత విలువైన భూమిని ప్రైవేట్‌కు అప్పగించే ఫైల్‌ అంతే వేగంతో అన్ని శాఖలు తిరిగిందని సచివాలయ వర్గాలు తెలిపాయి. వీటి ప్రకారం..
  • ప్లాట్‌ నం.1లో ఉన్న 15,445 గజాలు (సుమారు మూడున్నర ఎకరాలు) ప్రైవేట్‌ సంస్థకు ఫిజికల్‌ పొజిషన్‌ అప్పగిస్తూ ఈ ఏడాది మే 22న పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
  • కేవలం వారం రోజుల్లోనే ఈ ఉత్తర్వులు హైదరాబాద్‌ జిల్లా పరిశ్రమల శాఖ జీఎంకు చేరాయి.
  • ఈ ఉత్తర్వుల ఆధారంగా భూమిని సర్వే చేయాలని కోరుతూ జూన్‌ 12న హిమాయత్‌నగర్‌ తహసీల్దార్‌కు లేఖ రాశారు.
  • జీఎం లేఖ ఆధారంగా తహసీల్దార్‌ జూన్‌ 20న సర్వే నిర్వహించారు.
  • తహసీల్దార్‌ ఆ తర్వాత మూడు రోజుల్లోనే నివేదిక సిద్ధం చేశారు. జూన్‌ 24న జిల్లా పరిశ్రమల శాఖ జీఎంకు పంపించారు.
  • ఈ నివేదికను ఒక్క రోజులోనే అంటే.. జూన్‌ 25న పరిశ్రమల శాఖ డైరెక్టర్‌కు పంపించారు.
  • ఈ లేఖల ఆధారంగా పరిశ్రల శాఖ డైరెక్టర్‌ జూలై 9న ఆయిల్‌ఫెడ్‌కు లేఖ రాశారు.
  • ఇలా కేవలం 48 రోజుల్లోనే ఈ భూమికి సంబంధించిన ఫైళ్లు సంబంధిత అన్ని శాఖలకు తిరగడం, పని పూర్తి కావడం గమనార్హం. ఇంత వేగంగా ఫైళ్లు కదలడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత వేగంగా చేసేందుకు కారణాలు ఏమిటి? అంత ప్రేమ ఎందుకు? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

వీటన్నింటికీ ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉన్నది

అది రూ.500 కోట్ల విలువైన భూమి. నగరం నడిబొడ్డున ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఉన్నది. ఓ ప్రైవేట్‌ సంస్థకు, ప్రభుత్వానికి మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతున్నది. సుమారు 35 ఏండ్లుగా ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నది. చివరికి ‘ఈ భూమిపై ప్రభుత్వమే చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలి’ అని హైకోర్టు ఇటీవల సూచించింది. బాధ్యతాయుతమైన ప్రభుత్వమైతే ఏం చేస్తుంది? రూ.వందల కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకొంటుంది. ల్యాండ్‌ బ్యాంక్‌లో జమ చేస్తుంది. లేదా దశాబ్దాలుగా దాన్ని కాపాడుతున్న ఆయిల్‌ఫెడ్‌కు అప్పగిస్తుంది. కానీ ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వం!

శూన్యం నుంచి కూడా ఆదాయాన్ని పిండుకొని జేబులు నింపుకొనే నేతలు రాజ్యమేలుతున్న కాలం! అలాంటిది రూ.500 కోట్ల విలువైన భూమి కనిపిస్తుంటే ఊరుకుంటారా? అందుకే దాన్ని కేవలం రూ.87 కోట్లకే అప్పనంగా కొట్టేసేందుకు స్కెచ్‌ వేశారు. ముఖ్యనేత ఆదేశాల మేరకు ఫైల్‌ చకచకా పూర్తవుతున్నది. సాధారణంగా ప్రభుత్వంలో ఒక ఫైల్‌ కదలాలంటే నెలలకు నెలలు పడుతుంది. ఇక రెండుమూడు శాఖలతో ముడిపడి ఉన్నదైతే ఇంకా ఆలస్యం అవుతుంది. కానీ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ ఫైల్‌ మాత్రం రాకెట్‌ వేగంతో కదిలింది. కేవలం నెలన్నర రోజుల్లోనే పరిశ్రమలు, రెవెన్యూ, ఆయిల్‌ ఫెడ్‌.. ఇలా సంబంధిత విభాగాలన్నింటినీ చుట్టి వచ్చింది. క్లియరెన్స్‌లు మోసుకొచ్చింది. రూ.500 కోట్ల భూమిని ప్రైవేట్‌ సంస్థకు అడ్డగోలుగా కట్టబెట్టేందుకు ఇంత వేగం ఎందుకనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

RELATED ARTICLES

Popular Articles