Thursday, October 8, 2026

Top 5 This Week

Related Posts

దేవుండ్ల పేరిట దేశ విభజన-Namasthe Telangana- PARAHUSHAR NEWS

జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుండ్ల పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం రాముడు వర్సెస్‌ శివుడు అంటూ మన దేవుండ్ల మధ్యే విభజన తెచ్చేలా మాట్లాడుతున్నరు. ఇదేనా రెండు జాతీయ పార్టీల ఎజెండా? ఉద్యోగాల కల్పన, హామీల అమలు, అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ఎందుకు చర్చించడం లేదు?


దేవుండ్ల పేరిట దేశ విభజన
  • బీజేపీ- కాంగ్రెస్‌ దుష్ట రాజకీయాలు
  • బీజేపీతో మాకు ఎలాంటి పొత్తూ ఉండబోదు
  • 26 ఏండ్ల్లలో బీఆర్‌ఎస్‌ ఏనాడూ పొత్తు పెట్టుకోలే
  • జనాభా ఆధారంగా డీలిమిటేషన్‌ చేపడితే..
  • నియంత్రణ పాటించిన దక్షిణాదికి తీవ్ర నష్టం
  • కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయత ప్రశ్నార్థకం
  • సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారించాలి
  • సమస్యలపై యువత ప్రశ్నిస్తుంటే కేంద్రం డైవర్షన్‌
  • మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే.. కేసీఆరే సీఎం
  • కాంగ్రెస్‌ సర్కార్‌పై ప్రజల్లో పెరిగిన అసంతృప్తి
  • రాష్ట్రంలో రీకాల్‌, రిగ్రెట్‌, రివోల్ట్‌ పరిస్థితి ఉన్నది
  • కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్‌

జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుండ్ల పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం రాముడు వర్సెస్‌ శివుడు అంటూ మన దేవుండ్ల మధ్యే విభజన తెచ్చేలా మాట్లాడుతున్నరు. ఇదేనా రెండు జాతీయ పార్టీల ఎజెండా? ఉద్యోగాల కల్పన, హామీల అమలు, అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ఎందుకు చర్చించడం లేదు?

వ్యవసాయ రంగాన్ని నిలబెట్టేందుకు బీఆర్‌ఎస్‌ తెచ్చిన రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్తు, కాళేశ్వరం జలాల వంటి విప్లవాత్మక చర్యలతో పల్లెలు కళకళలాడితే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన స్వల్పకాలం లోనే వ్యవసాయం సంక్షోభంలో కూరుకు పోయింది. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నయ్‌.. కరెంట్‌ కోతలు పునరావృ తమవుతున్నయ్‌.. సకాలంలో యూరియా దొరక రైతులు రోడ్లపైకి వస్తున్నరు. రూ.2 లక్షల రుణమాఫీలో కోతలు, నిబంధనలతో లక్షలాది మంది రైతులు బ్యాంకు రుణాల ఊబిలోనే చిక్కుకుపోయిండ్రు.
-బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

Ktr2

Ktr

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30 (నమస్తే తెలంగాణ): జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మతం, దేవుండ్ల పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశాన్ని మత ప్రాతిపదికన, హిందూ-ముస్లింలుగా విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం రాముడు వర్సెస్‌ శివుడు అంటూ మన దేవుండ్ల మధ్యనే విభజన తెచ్చేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇదేనా రెండు జాతీయ పార్టీల ఎజెండా? అని ప్రశ్నించారు.

తెలంగాణలో రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తంచేశారు. బీజేపీతో బీఆర్‌ఎస్‌కు ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టంచేశారు. గత 26 ఏండ్లలో బీజేపీతో ఒకసారి కూడా పొత్తు పెట్టుకోలేదని, 2014, 2018, 2023 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ భావజాలపరంగా, సైద్ధాంతికంగా బీజేపీకి వ్యతిరేకమని, అలాంటప్పుడు ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటామని ప్రశ్నించారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నదని, ప్రజల్లో రీకాల్‌, రిగ్రిట్‌, రివోల్ట్‌ పరిస్థితి కనిపిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేసినందుకు ప్రజలు పునరాలోచిస్తున్నారని, ఈ అసంతృప్తి తిరుగుబాటు దిశగా మారుతున్నదని తెలిపారు. కేరళలోని కొచ్చి వేదికగా గ్రాండ్‌ హయత్‌లో జరిగిన ‘ఇండియా టుడే’ కాన్‌క్లేవ్‌ సౌత్‌ సదస్సులో కేటీఆర్‌ మాట్లాడారు. ‘తెలంగాణ స్టేట్‌.. ఫార్మేషన్‌ టు ట్రాన్స్‌ఫార్మేషన్‌’ అనే ప్రధాన ఇతివృత్తంపై సాగిన ముఖాముఖిలో తన అభిప్రాయాలను స్పష్టంచేశారు.

అభివృద్ధిలో రోల్‌మాడల్‌ తెలంగాణ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నుంచి అనతికాలంలోనే సాధించిన విప్లవాత్మక మార్పులను కేటీఆర్‌ సవివరంగా ఆవిషరించారు. ఎన్నో అనుమానాలు, అపోహల మధ్య ఆవిర్భవించిన తెలంగాణను కేసీఆర్‌ నాయకత్వంలో పదేండ్ల వ్యవధిలోనే దేశానికే దిక్సూచిగా నిలిపామని వివరించారు. సంక్షేమం, పారిశ్రామికాభివృద్ధి, ఐటీ ఎగుమతులు, వ్యవసాయ రంగాల్లో సాధించిన అపూర్వ పురోగతి ద్వారా కొత్తగా ఏర్పడిన ఒక చిన్న రాష్ట్రం ఎలా ఆర్థిక ఇంజిన్‌గా మారిందో ప్రపంచానికి నిరూపించామని స్పష్టం చేశారు.

2014లో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీసీ) రూ.నాలుగు లక్షల కోట్లు మాత్రమే ఉండగా, 2023 నాటికి రూ.15 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. తలసరి ఆదాయం రూ.1.12 లక్షల నుంచి రూ.3.57 లక్షలకు ఎగబాకి దేశంలోనే పెద్ద రాష్ట్రాల సరసన అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. 30% జాతీయ అవార్డులు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు దక్కాయని తెలిపారు. వ్యవసాయం, ఐటీ, ఆవిషరణల్లో దేశంలోనే 12వ స్థానం నుంచి టాప్‌ ర్యాంకులకు చేరుకున్న తెలంగాణ ప్రస్థానం స్వయంకృషితో రాసుకున్న విజయగాథ అని స్పష్టం చేశారు.

Ktr1

Ktr

అన్నదాతల కన్నీళ్లు తుడువని సరార్‌
వ్యవసాయ రంగాన్ని నిలబెట్టేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత 24 గంటల విద్యుత్తు, కాళేశ్వరం జలాలు వంటి విప్లవాత్మక చర్యలతో పల్లెలు కళకళలాడాయని కేటీఆర్‌ గుర్తుచేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే సాగునీరు అందక పంటలు ఎండిపోవడం, విద్యుత్తు కోతలు, సకాలంలో యూరియా దొరక రైతులు రోడ్లపైకి రావడం బాధాకరమని చెప్పారు. రూ.2 లక్షల రుణమాఫీ అమల్లో కోతలు, నిబంధనల వల్ల లక్షలాది మంది అన్నదాతలు బ్యాంకు రుణాల ఊబిలోనే మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

బుల్డోజర్‌ సంస్కృతి.. హైడ్రా కూల్చివేతలు
హైడ్రా పేరిట హైదరాబాద్‌ నగరంలో కొనసాగుతున్న విచక్షణారహిత కూల్చివేతలపై కేటీఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రభుత్వం నుంచి అన్నిరకాల అనుమతులు తీసుకొని, బ్యాంకుల నుంచి రుణాలు పొంది, జీవితకాల సంపాదనతో ఇండ్లు నిర్మించుకున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలను నిరాశ్రయులను చేయడం అమానవీయమని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాల నియంత్రణ పేరుతో సామాన్యుల గూళ్లను కూల్చడం సరైన విధానం కాదని, ఉత్తరాది తరహా బుల్డోజర్‌ రాజకీయాలు తెలంగాణ ప్రజాస్వామ్య సంస్కృతికి విరుద్ధమని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు
తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నదని కేటీఆర్‌ చెప్పారు. 2023 ఎన్నికల్లో 420కి పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వాటిలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదని కేటీఆర్‌ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రజానాడిని కేటీఆర్‌ మూడు పదాల్లో విశ్లేషించారు. ‘రీకాల్‌ (గతాన్ని నెమరువేసుకోవడం), రిగ్రెట్‌ (పశ్చాత్తాపం చెందడం), రివోల్ట్‌ (తిరుగుబాటు చేయడం)’గా అభివర్ణించారు.

‘కేసీఆర్‌ పాలనలో శాంతిభద్రతలు, నిరంతర విద్యుత్తు, సంక్షేమ పథకాలు ఎలా ఉండేవో ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు (రీకాల్‌). ఆచరణ సాధ్యంకాని హామీలను నమ్మి కాంగ్రెస్‌కు అధికారం అప్పగించినందుకు లబోదిబోమంటూ పశ్చాత్తాపపడుతున్నారు (రిగ్రెట్‌). వచ్చే రోజుల్లో ఈ మోసపూరిత పాలనపై ప్రజలు సమష్టిగా తిరుగుబాటు చేయడం ఖాయం (రివోల్ట్‌)’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటేసినందుకు ప్రజలు పునరాలోచిస్తున్నారని, ఈ అసంతృప్తి తిరుగుబాటు దిశగా మారుతున్నదని చెప్పారు.

దక్షిణాది సంపదపై కేంద్ర పక్షపాత వైఖరి
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టిన కేటీఆర్‌.. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను ఎండగట్టారు. దేశ జీడీపీలో, పన్నుల ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాలు సింహభాగం సమకూరుస్తున్నా, పన్నుల వాటా పంపకాల్లో కేంద్రం అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. దక్షిణాది ప్రజల కష్టార్జితాన్ని ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి మళ్లిస్తూ, కష్టపడే రాష్ట్రాలను ఆర్థికంగా నిర్వీర్యం చేయడం సమగ్ర సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఈ పన్నుల దోపిడీపై జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ జరుగాలని పేర్కొన్నారు.

డీలిమిటేషన్‌తో దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించే కుట్ర
డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేటీఆర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. జనాభా ప్రాతిపదికన చేపట్టనున్న లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌)పై దక్షిణాది రాష్ట్రాల నాయకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్‌ చేపడితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా గతంలో సుమారు 24% ఉండగా, ప్రస్తుతం 19 శాతానికి తగ్గిందని తెలిపారు. పార్లమెంట్‌ సీట్లు పెంచాలనుకుంటే అసెంబ్లీ స్థానాలను కూడా ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు.

అస్సాం, జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లు పెంచినప్పుడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎందుకు పెంచలేదని నిలదీశారు. దామాషా ప్రకారం సీట్లు పెంచితేనే మద్దతు ఇస్తామని చెప్పారు. డీలిమిటేషన్‌ పేరుతో దక్షిణాది గొంతు నొకే ప్రయత్నం చేస్తే అన్ని ప్రాంతీయ శక్తులు ఒకతాటిపైకి వచ్చి పోరాడాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ ప్రభావం తకువగా ఉండటం వల్లే సీట్ల పెంపును పట్టించుకోవడం లేదన్న అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. డీలిమిటేషన్‌ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరుగదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇచ్చిన హామీలపై తమకు నమ్మకం లేదన్నారు.

Ktr3

Ktr

దేవుండ్లను రాజకీయాల్లోకి లాగడం విడ్డూరం
జాతీయ పార్టీల నాయకులు ప్రజా సమస్యలను పకనపెట్టి దేవుండ్లను, మతాలను రాజకీయాల్లోకి లాగడం అత్యంత విడ్డూరంగా ఉన్నదని కేటీఆర్‌ ఆక్షేపించారు. ఉద్యోగాల కల్పన, హామీల అమలు, అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ఎందుకు చర్చించడం లేదని నిలదీశారు. ప్రజల వాస్తవ సమస్యలు, ఇచ్చిన హామీలపై ప్రభుత్వాలు ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం యువత ప్రశ్నిస్తుంటే పట్టించుకోవడం లేదని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ హామీ ఏమైందని నిలదీశారు.

ఉద్యోగాలపై సమాధానం ఇవ్వకుండా దృష్టి మళ్లించడం సరికాదని, ఇంకెంతకాలం మతం పేరుతో దేశాన్ని విభజిస్తారని మండిపడ్డారు. 2022 నాటికే ప్రతి ఇంటికీ మంచినీరు, బుల్లెట్‌ రైళ్లు, ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వంటి వంటి వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి, ఉపాధి వంటి కీలక అంశాలను వదిలేసి రామమందిర్‌, రామమందిర్‌ చోరీ, మతం చుట్టూ రాజకీయాలు నడుపడం తగదని, ప్రజల సమస్యలపైనే అసలైన చర్చ జరుగాలని స్పష్టం చేశారు.

జెన్‌జీ ఉద్యమాలు కొత్తేమీ కాదు
జెన్‌జీ ఉద్యమాలపై స్పందించిన కేటీఆర్‌.. దేశంలో యువత ఉద్యమించడం కొత్తేమీ కాదని, తెలంగాణ ఉద్యమం కూడా అదే తరహాలో సాగిందని చెప్పారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై యువత, ముఖ్యంగా జెన్‌జీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నదని తెలిపారు. సమస్యలపై యువత ప్రశ్నిస్తుంటే కేంద్ర ప్రభుత్వం దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం, క్విట్‌ ఇండియా ఇలా అనేక ఉద్యమాలు సాగాయని గుర్తుచేశారు. యువత ఉద్యమించే మార్పును స్వాగతించాలని చెప్పారు. నేపాల్‌లో కూడా జెన్‌జీ ఉద్యమించిందని, నీట్‌ పేపర్‌ లీక్‌తో యువత రోడ్డుపైకి వచ్చారని గుర్తుచేశారు. జెన్‌ జీ ఉద్యమం వెనుక పార్టీల మద్దతు ఉన్నదని అనుకోవడం లేదని, సమస్యలపై స్పందించే గుణం వారిలో ఉన్నదని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌కు ముప్పు
హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులకు రాజధానిగా నిలిపేందుకు పదేండ్ల్లపాటు అహర్నిశలు శ్రమించామని కేటీఆర్‌ గుర్తుచేశారు. అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాలు హైదరాబాద్‌ వైపు చూడటానికి బీఆర్‌ఎస్‌ కల్పించిన రాజకీయ సుస్థిరత, మెరుగైన శాంతిభద్రతలే కారణమని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వానికి పారిశ్రామిక అభివృద్ధిపై సరైన దృష్టి లేకపోవడం, అనవసర వివాదాలతో అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో అయోమయం నెలకొన్నదని, ఇది హైదరాబాద్‌ అంతర్జాతీయ బ్రాండ్‌ ఇమేజ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.

ఈసీఐ విశ్వసనీయత ప్రశ్నార్థకం
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరు, విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారిందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈసీపై వస్తున్న తీవ్ర ఆరోపణలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నార్థకం చేస్తున్నాయని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల సంఘం చర్యలను సమర్థిస్తున్నప్పటికీ, ఈసీ తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర అనుమానాలు నెలకొన్నాయని అన్నారు.

ప్రస్తుతం తలెత్తిన వివాదాల నేపథ్యంలో సుప్రీంకోర్టు సిట్టింగ్‌ లేదా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ పరిరక్షణ దృష్ట్యా సుప్రీంకోర్టు స్వచ్ఛందంగా (సుమోటోగా) ఈ వ్యవహారాన్ని స్వీకరించి విచారణకు ఆదేశించాలని కోరారు. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ స్వచ్ఛందంగా తన పదవి నుంచి తప్పుకోవాలని, అప్పుడే నిష్పాక్షిక విచారణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌పై కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేయడం అవసరమేనని, అయితే ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని చెప్పారు. బీఆర్‌ఎస్‌ గెలిచిన 39 నియోజకవర్గాల్లోనే అత్యధిక ఓట్లు తొలగించారని ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌పై నెలకొన్న అనుమానాలు, ఆందోళనలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకొని పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని కోరారు.

జైలు బెదిరింపులకు భయపడే చరిత్ర మాది కాదు
పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్‌ఎస్‌ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విచారణ కమిషన్లు, తప్పుడు కేసులతో కాంగ్రెస్‌ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నదని కేటీఆర్‌ మండిపడ్డారు. ‘మేం ఏసీ రూముల్లోంచి వచ్చిన నాయకులం కాదు, తెలంగాణ ఉద్యమ నిప్పురవ్వల నుంచి, లాఠీ దెబ్బల మధ్య ప్రజలతో కలిసి పోరాడి వచ్చిన ఉద్యమకారులం. అక్రమ కేసులు, జైలు బెదిరింపులకు భయపడే పిరికివాళ్లు ఎవరూ లేరు’ అని తేల్చిచెప్పారు. చట్టంపై తమకు పూర్తి గౌరవం ఉన్నదని, న్యాయస్థానాల్లోనే ప్రభుత్వ కుట్రలను బట్టబయలు చేస్తామని ప్రకటించారు.

ప్రాంతీయ పార్టీలే రాష్ట్రాలకు శ్రీరామరక్ష
బీజేపీ, కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీలు ఢిల్లీ అధిష్ఠానాల కనుసన్నల్లోనే నడుస్తాయని, అవి ఎన్నటికీ రాష్ట్రాల ఆత్మగౌరవాన్ని కాపాడలేవని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకొనే ముఖ్యమంత్రులు ప్రాంతీయ ప్రయోజనాలను కాపాడలేరని విమర్శించారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కంటే ఢిల్లీ నాయకత్వానికి విధేయత చూపుతున్నారని ఆరోపించారు. ప్రాంతీయ అవసరాలు, స్థానిక సమస్యలపై పూర్తి స్పష్టత కలిగిన బీఆర్‌ఎస్‌ వంటి ప్రాంతీయ శక్తులే తెలంగాణ ప్రయోజనాలకు అసలైన రక్షణ కవచమని, ప్రజల హకుల కోసం ఢిల్లీతోనైనా రాజీలేని పోరాటం చేసేది తామేనని పేరొన్నారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు.

తెలంగాణలో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుంది
ఎన్నికల ఓటమితో బీఆర్‌ఎస్‌ పార్టీ కుంగిపోలేదని, ప్రజల ఆశీర్వాదంతో తిరిగి ఉవ్వెత్తున పుంజుకుంటామని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు శిరోధార్యమని, లోపాలను సమీక్షించుకుంటూ సంస్థాగతంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిషారం కోసం నిరంతరం క్షేత్రస్థాయిలోనే పోరాడుతామని, పాలకులు చేస్తున్న తప్పులను ప్రతి క్షణం ఎండగడుతామని, ప్రజా మద్దతుతో త్వరలోనే రాష్ట్రంలో మళ్లీ గులాబీ జెండా రెపరెపలాడటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Popular Articles