
భూపాలపల్లి: భూపాలపల్లి లారీ అసోసియేషన్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో లారీ-రవాణా రంగం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక వస్తువులు, నిర్మాణ సామగ్రి రవాణాను లారీ యజమానులు, డ్రైవర్లు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని ఆయన నొక్కి చెప్పారు.
లారీ యజమానులు ఎదుర్కొంటున్న నిర్వహణ ఖర్చులు, పెరుగుతున్న విడిభాగాల ధరలు, ఇంధన ఖర్చులు వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భూపాలపల్లి నియోజకవర్గం మరియు జిల్లాలో ప్రభుత్వ సంబంధిత రవాణా అవసరాలకు స్థానిక లారీ యజమానులకు ప్రాధాన్యత ఇచ్చేలా కృషి చేస్తానని చెప్పారు.
భూపాలపల్లి అభివృద్ధిలో భాగంగా గూడెపాడు నుంచి భూపాలపల్లి వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన లారీ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన నూతనంగా ఎన్నికైన సంఘం అధ్యక్షులు పులి వేణుగోపాల్ గౌడ్, నూతన పాలకవర్గ సభ్యులను అభినందించి లారీ-రవాణా రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, లారీ అసోసియేషన్ నూతన పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్మికులు, లారీ యజమానులు, డ్రైవర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




