
నాగర్ కర్నూల్: జిల్లా సంక్షేమాధికారి రాజేశ్వరి మాట్లాడుతూ పిల్లలను కాపాడుకోవడం సమష్టి బాధ్యత అని ఉద్ఘాటించారు. టచ్ ఆర్గనైజేషన్, మిరాకిల్ ఫౌండేషన్ (చెన్నై) సంయుక్తంగా మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బందికి నిర్వహించిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంగళవారం నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో డీసీపీయూ, చైల్డ్‌లైన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ), జువైనల్ జస్టిస్ బోర్డ్ (జేజేబీ), సఖి వన్‌స్టాప్ సెంటర్ సిబ్బందికి బాలల రక్షణ, సంరక్షణ వ్యవస్థలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.
శిక్షణలో భాగంగా జువైనల్ జస్టిస్ యాక్ట్, 2015, బాలల రక్షణ విధానాలపై సవివరమైన సెషన్స్ నిర్వహించారు. రిసోర్స్ పర్సన్ డేవిడ్ రాజు పిల్లల సమస్యలను గుర్తించడం, పునరావాసం కల్పించడం మరియు అత్యవసర సేవలను సమర్థవంతంగా అందించే పద్ధతులను వివరించారు.
కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు లక్ష్మణరావు, జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యురాలు గిరిజా ప్రీతి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీశైలం, సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ సునీత, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ మౌనిక, మిరాకిల్ ఫౌండేషన్ ప్రతినిధులు డైరెక్టర్ వాల్వెల్, హనుమాన్ బంజరి, రజనీ, వినయ్ తదితరులు పాల్గొన్నారు.




