
మహబూబ్‌నగర్‌లో జన్మించిన ప్రతి బిడ్డ అపూర్వమని, కోహినూర్ వజ్రమేనని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని 150 మంది పదో తరగతి విద్యార్థులకు ఐఐఐటీల్లో ప్రవేశం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ శిబిరం ప్రదానోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మహబూబ్ నగర్ లోని వైటీసీ భవనంలో మహబూబ్ నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ సంయుక్తంగా 45 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో అన్యాయాలు, కష్టాలు ఎదుర్కొన్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాలమూరుకు జరిగిన అన్యాయం విశేషమైన పాత్ర పోషించిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికీ జిల్లాకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని యువతను కోరారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని, తెలంగాణ ఎదుగుదలకు అనేక అవకాశాలను అందిస్తోందన్నారు.
విద్యార్థుల విజయానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాంను ఉటంకిస్తూ, “తక్కువ లక్ష్యం నేరం” అనే సందేశాన్ని విద్యార్థులకు గుర్తు చేస్తూ ఉన్నత ఆశయాలను కొనసాగించమని వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు హాజరుకాగా, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు కార్యక్రమానికి రంగులు అద్దాయి.




