
ఖానాపూర్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నామని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.
సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని ఆమె ఉద్ఘాటించారు. ఆన్‌లైన్‌లో సమావేశానికి హాజరైన తహశీల్దార్‌లు, ఎంపీడీఓలకు ఎన్నికల నిర్వహణ విధివిధానాలపై మరోసారి మార్గనిర్దేశం చేశారు.
ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆమె అధికారులకు సూచించారు. ఎన్నికల సిబ్బంది, సామగ్రి రవాణాకు సరిపడా వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆమె ఆదేశించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఏఎస్పీ ఉపేంద్రరెడ్డి, డీపీఓ శ్రీనివాస్, డీఈవో భోజన్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.



