
హైదరాబాద్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ల సాధన కోసం జూన్ 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యను వ్యాపారంగా మార్చే ప్రయివేటు సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జీవన్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా వ్యవహరిస్తోందని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ప్రభుత్వ పాఠశాలలను మూసేయడం వల్ల నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుందని జీవన్ అన్నారు. అధిక ఫీజులు, పాఠ్యపుస్తకాల ద్వారా దోపిడీ, విద్యాహక్కు చట్టం అమలులో నిర్లక్ష్యం, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయడం, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయడం, జాతీయ విద్యా విధానం-2020 అమలు చేయడం వంటి పలు కీలక డిమాండ్‌ల సాధన కోసం బంద్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యను పరిరక్షించేందుకు బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలకు జీవన్ విజ్ఞప్తి చేశారు.




