Wednesday, October 14, 2026

Top 5 This Week

Related Posts

NSS వ్యవసాయ విద్యార్థులు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు – PARAHUSHAR NEWS

నాగర్ కర్నూల్: తాడూరు మండలం ఇంద్రకల్‌ గ్రామంలో పాలెంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ కళాశాల నాలుగో సంవత్సరం విద్యార్థులు ఎన్‌.నవత, శ్రీరమ్య ఆధ్వర్యంలో ప్రత్యేక జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) శిబిరం నిర్వహిస్తున్నారు.

శిబిరం రెండో రోజైన ఆదివారం రైతు వేదికలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పల్లవి, ప్రశాంత్ నేతృత్వంలోని విద్యార్థి బృందాలు సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత, సేంద్రియ ఎరువుల తయారీ, వినియోగం గురించి వివరించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం వల్ల అధిక లాభాలు ఎలా పొందవచ్చో రైతులకు ప్రత్యేక శిక్షణ కూడా అందించారు.

కావ్య నేతృత్వంలోని మరో విద్యార్థి బృందం రైతులకు ఎరువులు వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. రైతులు తమ పొలాల్లో రెండు, మూడేళ్లకు ఒకసారి భూసార పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. రైతుల పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి, భూసార పరీక్షల నివేదికల ఆధారంగా వ్యవసాయ అధికారులు తగిన ఎరువులను సిఫారసు చేస్తారని వారికి తెలియజేశారు. రైతులే దేశ రక్షకులని వక్తలు ఉద్ఘాటించారు.

ఈనెల 20వ తేదీ వరకు ఇంద్రకల్ గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. శిబిరంలో భాగంగా విద్యార్థులు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి విద్యతో పాటు సామాజిక సేవను చాటిచెప్పారు.

ఆకర్ష్‌, నితిన్‌, వినాయక్‌, ప్రవీణ్‌, కార్తీక్‌, పవిత్ర, త్రిష, చైతన్య, అశ్విత, పల్లవితో సహా విద్యార్థి బృందాలు స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం కింద ఇంటింటికీ వెళ్లి ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులను ప్రోత్సహించారు. కార్యక్రమంలో భాగంగా కొన్ని ప్రాంతాలను శుభ్రం చేశారు. గ్రామస్తులు అందిస్తున్న సహకారాన్ని వారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పాలెం వ్యవసాయ కళాశాలకు చెందిన 167 మంది విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు.

Popular Articles