
నాగర్‌కర్నూల్: ప్రపంచ జనాభా దినోత్సవం–2026 వేడుకల్లో భాగంగా శుక్రవారం నాగర్‌కర్నూల్‌లోని ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల (ఆర్ట్స్ అండ్ కామర్స్)లో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కళాశాల ఎకనామిక్స్ విభాగం, లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
విద్యార్థులు పోటీలో చురుగ్గా పాల్గొని “ఈనాడు మరియు భవిష్యత్తు కోసం యువత ఆశలు మరియు ఆకాంక్షలను నెరవేర్చడం” అనే అంశంపై వ్యాసాలు రాశారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.గీతాంజలి అధ్యక్షత వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, క్లాస్ మేట్ క్లబ్ అధ్యక్షుడు వాసా రాఘవేందర్, ప్రసాద్, రామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ గీతాంజలి మాట్లాడుతూ యువత ఆశయాలను సాధించడంలో విద్య, నైపుణ్యం, ఆరోగ్యం కీలకపాత్ర పోషిస్తాయన్నారు. జనాభా సవాళ్లు మరియు స్థిరమైన అభివృద్ధిలో యువత పాత్ర గురించి ఆమె విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రత్లావత్ కృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




