Sunday, October 11, 2026

Top 5 This Week

Related Posts

విద్యాసంస్థల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే నాయిని – PARAHUSHAR NEWS

హనుమకొండ : పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాలను రాష్ట్రంలోనే మరోసారి ఆదర్శ విద్యాసంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కృషి చేస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధి, మౌలిక వసతులు, విద్యార్థుల అవసరాలు, భవిష్యత్తు ప్రణాళికలపై ఆయన అధ్యాపకులు, అధికారులతో చర్చించారు.

అనంతరం కళాశాలలోని సెమినార్ హాలులో ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో స్టేట్ ర్యాంక్ సాధించిన విద్యార్థినిని ఎమ్మెల్యే అభినందించి ప్రోత్సాహకంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.లక్ష చెక్కును అందించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, హాస్టల్‌ సౌకర్యాలు, ఆధునిక వనరులను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలతో సత్కరిస్తే పేద కుటుంబాల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందన్నారు. ప్రతిభను గుర్తించడం వల్ల ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రజల్లో నమ్మకం మరింత బలపడుతుందన్నారు. పింగిళి కళాశాల అభివృద్ధికి సంబంధించిన అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరోసారి విద్యారంగానికి ప్రతీకగా నిలిచిన సంస్థను పునరుద్ధరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Popular Articles