
భద్రకాళి మాడ వీధుల అభివృద్ధి పనుల వల్ల నష్టపోయిన కుటుంబాలకు జీవనోపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో అర్హులైన 30 మంది లబ్ధిదారులకు ఔట్‌సోర్సింగ్ నియామక పత్రాలను పంపిణీ చేసింది.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌లు సంయుక్తంగా లబ్ధిదారులకు నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలతో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా, వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని ఆయన తెలిపారు.
అర్హులైన లబ్దిదారులకు ఔట్ సోర్సింగ్ ఉపాధి కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ, గృహ, ఉపాధి పథకాలు అందేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో కుడా సీపీఓ అజిత్‌రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.




