
భూపాలపల్లి: సోమవారం ఐడీసీఓ కార్యాలయంలో రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన, సహకార శాఖల అధికారులతో యూరియా సరఫరా, విక్రయాలు, సంబంధిత అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
మండల ప్రత్యేకాధికారులు, టాస్క్ఫోర్స్ బృందాలు, డివిజనల్ స్పెషల్ అధికారులు ప్రతిరోజూ క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయాలని, ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి యూరియా విక్రయాలు ప్రారంభించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.
ప్రతి స్టాక్ పాయింట్ వద్ద ఓపెనింగ్, క్లోజింగ్ స్టాక్ను స్పష్టంగా తెలియజేసే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
ప్రతి విక్రయ కేంద్రంలో అదనపు కౌంటర్లు, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం సహకార శాఖ 10 కేంద్రాలను నడుపుతోందని, అదనంగా మరో 22 విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు.
ప్రస్తుతం ఏఆర్ ఎస్ కే ద్వారా 18, డీసీఎంఎస్ ద్వారా 27, హెచ్ ఏసీఏ ద్వారా 12, రిటైలర్ల ద్వారా 327 కేంద్రాల్లో యూరియా విక్రయిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో 2,967 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
జిల్లాలో 126,805 ఎకరాల్లో వరి, మొక్కజొన్న కలిపి మొత్తం 10 పంటలు సాగుచేస్తున్నట్లు తెలిపారు.
యూరియా పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజలకు స్పష్టంగా కనిపించేలా కౌంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి సహాయం కావాలంటే వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్: 7893098307కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.
సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, వ్యవసాయ అధికారి బాబూరావు, సహకార అధికారి వలియా నాయక్, వ్యవసాయ శాఖ ఏడీఏ, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.




