
మర్రిగూడ (నల్గొండ): మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉద్యానవన శాఖ, సెరీకల్చర్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రైతు అవగాహనా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హాజరై రైతులనుద్దేశించి మాట్లాడారు.
రైతులు పండించే పంటల్లో మార్పులు తీసుకురావడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని సూచించారు. ముఖ్యంగా పామాయిల్ సాగుకు ప్రభుత్వ రాయితీలు, సాంకేతిక సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్కెట్ డిమాండ్ ఆధారంగా పంటలను ఎంపిక చేసుకోవడంతోపాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని కూడా ఆయన ఉద్ఘాటించారు.
రైతుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి రైతును ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పునరుద్ఘాటించారు.
కార్యక్రమంలో చండూరు మున్సిపాలిటీ చైర్మన్ కోడి శ్రీనివాస్, ఏడీఈ వేణుగోపాల్, ఈదుల బిక్షంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




