
మహబూబ్ నగర్: జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మార్కెట్ యార్డులో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దీంతోపాటు కొనుగోలు కేంద్రంలో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను అనిరుధ్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
రైతులు దళారులు, వ్యాపారుల బారిన పడవద్దని, తమ ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పి)ని ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కొంత మంది వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరకు మొక్కజొన్నను కొనుగోలు చేసి మార్కెట్ షెడ్లలో నిల్వ చేసి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని ఎమ్మెల్యే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను తప్పుదోవ పట్టించే, దోపిడీ చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
రెండు రోజుల క్రితం అర్ధరాత్రి మార్కెట్ యార్డును సందర్శించిన సందర్భంగా రైతులు తమ ఉత్పత్తులను బయట ఉంచగా, వ్యాపారుల నిల్వలను షెడ్లలోనే నిల్వ చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. వెంటనే డీజీ విజిలెన్స్ చౌహాన్తో మాట్లాడి సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. షెడ్లలో నిల్వ ఉంచిన అక్రమ నిల్వలను బయటకు వెళ్లనివ్వవద్దని అధికారులను ఆదేశించారు.
రైతులకు అసౌకర్యం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పునరుద్ఘాటించిన ఆయన, రైతాంగాన్ని నిరంతరం ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పీఏసీఎస్ నిర్వాహకులు, మార్కెట్ కమిటీ అధికారులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




