
యాప్రాల్ జంక్షన్‌లో ఫ్రీ లెఫ్ట్ ఉండేలా రోడ్డు భద్రత కల్పించి ట్రాఫిక్‌ను సులభతరం చేసేందుకు చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. యాప్రాల్‌లోని చంద్రగిరి కాలనీ , యాప్రాల్ జంక్షన్ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా యాప్రాల్ జంక్షన్ సమీపంలోని చిన్న ట్రాన్స్ మిషన్ టవర్ వల్ల తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కమిషనర్ సమీక్షించారు. ట్రాన్స్ మిషన్ టవర్ ను సమీపంలోని పార్కు ప్రాంతానికి తరలించే అవకాశాలను సాంకేతికంగా పరిశీలించాలని సూచించారు.
అనంతరం యాప్రాల్ జంక్షన్ అభివృద్ధి ప్రతిపాదనలను కమిషనర్ పరిశీలించి ప్రాజెక్టుకు సంబంధించిన గణాంకాలను పరిశీలించారు. ఈ అభివృద్ధి పనుల వల్ల మొత్తం 53 ఆస్తులు ప్రభావితమవుతాయని, 57 విద్యుత్ స్తంభాలు, 3 ట్రాన్స్‌ఫార్మర్లు, 3 చెట్లను తరలించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. అలాగే మొత్తం 6,833.72 చదరపు గజాల విస్తీర్ణం భూసేకరణ పరిధిలోకి వస్తుందని కమిషనర్‌కు వివరించారు.
విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపునకు అవసరమైన డిమాండ్ నోటీసులు, వ్యయ అంచనాలను వెంటనే పొందాలని, విద్యుత్ శాఖ అధికారులతో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి పనులు వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు. అదేవిధంగా యాప్రాల్ జంక్షన్ అభివృద్ధికి అవసరమైన భూములు, ఆస్తుల సేకరణ ప్రక్రియను నిబంధనల మేరకు వేగవంతం చేయాలని సూచించారు.




