
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాల తీవ్రత పెరగనుంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనాల ప్రకారం, జూలై 3 నుండి జూలై 8 వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో జులై 3, 4 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రత్యేకంగా అంచనా వేసింది.ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
అదేవిధంగా జులై 4, 5 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఆ శాఖ హెచ్చరించింది. జూలై 5 నుంచి జూలై 8 వరకు ఇలాంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.




