
హనుమకొండ: సమ్మక్క–సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దంసరి అనసూయ (సీతక్క) ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి ములుగులోని మేడారం చేరుకున్నారు.
వీరికి పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, పోలీస్ సూపరింటెండెంట్ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రా, భూపాలపల్లి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిరిశెట్టి సంకీర్త్, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్ పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు.
అనంతరం వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలకు మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మహాజాతరను పురస్కరించుకుని మేడారంలోని చిలుకలగుట్ట రోడ్డు, స్థూపం, కన్నెపల్లి, జంపన్నవాగు, ఆర్టీసీ బస్‌స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఆలయ నిర్మాణ పనులను, మౌలిక వసతుల కల్పన పనులను పరిశీలించారు.
అంతకుముందు పొంగులేటి మాట్లాడుతూ మేడారం జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులు రానున్న రెండు వందల సంవత్సరాల వరకు చెక్కుచెదరని విధంగా చేపడుతున్నామని, నిర్ణీత గడువులోగా అన్ని పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
అమ్మవారి దర్శనం, మొక్కులు తీర్చుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు మేడారం తరలివస్తున్నారని తెలిపారు.
అనంతరం మేడారంలోని హరిత హోటల్‌లో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించి మేడారం జాతర అభివృద్ధి పనుల పురోగతిపై ఆదేశాలు జారీ చేశారు.
మీడియాతో మంత్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. గిరిజన సంప్రదాయాలు, సంస్కృతికి అద్దం పట్టే విధంగా గద్దెల ప్రాంతాల్లో పాలరాతి శిల్పాలతో పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. తక్కువ సమయంలోనే 100 శాతం పనులు పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నామని, చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా వచ్చే ఏడాది జనవరి 5 నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ మహాజాతరపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి కోట్లాది రూపాయల పనులను మంజూరు చేయడం అభినందనీయమని అభివర్ణించారు.



