
భారత మాజీ ప్రధాని, భారతరత్న గ్రహీత పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీవీకి ఘనంగా నివాళులర్పించారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో పివి నరసింహారావు అందించిన సేవలు మరువలేనివని గుర్తు చేశారు. ఈ సందేశాన్ని ముఖ్యమంత్రి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో పంచుకున్నారు.
స్వాతంత్య్ర సమరయోధుడిగా, బహుభాషావేత్తగా, దార్శనికత కలిగిన నేతగా పీవీ దేశ చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు. ఆర్థిక సంస్కరణలకు నాంది పలికి, భారత ఆర్థిక వ్యవస్థను కొత్త దిశలో నడిపించిన గొప్ప నాయకుడు పీవీ అని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.
సంక్లిష్ట సమయాల్లో సమర్ధవంతమైన నాయకత్వాన్ని అందించి భారతదేశ అభివృద్ధికి బలమైన పునాదులు వేసిన నాయకుడిగా పివి నరసింహారావు నిలుస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పీవీ నరసింహారావు సాధించిన విజయాలు రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని, ఆయన సేవలు, ఆలోచనలు, ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.




