
నల్గొండ: జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, అనుమతులు, పునరావాసం, పునరావాస (ఆర్‌అండ్‌ఆర్) చర్యలు, నిర్మాణ పనులను వేగవంతం చేసి డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని ఆర్‌అండ్‌ఆర్, భూసేకరణ, నీటిపారుదల శాఖ కమిషనర్ కె.శివకుమార్‌నాయుడు అధికారులను ఆదేశించారు.
శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులతో పాటు ఇంజినీర్లతో నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టుల వారీగా ప్రగతిని సమీక్షించారు. భూసేకరణ పూర్తయిన ప్రాంతాలకు సంబంధించి అవార్డు ప్రక్రియ పూర్తయిందని, ఇకపై జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. భూసేకరణ పూర్తయిన ఆర్‌అండ్‌ఆర్ కాలనీలకు లేఅవుట్‌లు సిద్ధం చేయాలని, మౌలిక వసతుల కల్పన పనులు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు గ్రామాల వారీగా పునరావాసం కల్పించాలని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.




