
హాలియా (నాగార్జున్‌సాగర్): తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ఆదుకోవాలని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీరారెడ్డి పిలుపునిచ్చారు. తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు ఆదివారం హాలియాలో గరుడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ శిబిరంలో అధిక సంఖ్యలో యువకులు, స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తలసేమియా వ్యాధితో దేశ వ్యాప్తంగా ఏటా వేలాది మంది చిన్నారులు, కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇలాంటి మానవతా కార్యక్రమాల ద్వారా రోగులను ఆదుకునేందుకు స్వచ్ఛంద రక్తదాతలు, సేవా సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో తలసేమియా వ్యాధిగ్రస్థుడు గంగుల శివ నాగరాజుకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందించారు. సమాజంలోని ప్రతి ఒక్కరు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రావుల శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్, కౌన్సిలర్లు చెరుపల్లి ముత్యాలు, నకిరేకంటి సైదులు, మజహర్ ఫౌండేషన్ ప్రతినిధులు, గరుడ ఫౌండేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొన్నారు.




