
శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల్లో విద్యారంగానికి 15 శాతం కేటాయింపులు పెంచాలని సేవ్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ కమిటీ–తెలంగాణ డిమాండ్ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి 8.2 శాతం నిధులు మాత్రమే కేటాయించడం పట్ల తెలంగాణ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్ కె.చక్రధరరావు, ప్రొఫెసర్ జి.హరగోపాల్, ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు కనీసం 20% నిధులు కేటాయించాలని సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ, విద్యార్థి, ఉపాధ్యాయ, అధ్యాపకుల సంఘాలు డిమాండ్ చేసినా, ప్రస్తుత ప్రభుత్వం చేయకపోవడం విచారకరమన్నారు.
ఇతర రాష్ట్రాలతో సమానంగా విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని గుర్తు చేశారు. 2,500 పాఠశాలలకు పూర్వ ప్రాథమిక విద్యను విస్తరింపజేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం, ఉపాధ్యాయుల కొరత (క్లాస్‌కు ఒక్క టీచర్ కూడా లేరు), ప్రీ ప్రైమరీ విద్యకు ఉపాధ్యాయుల శిక్షణ గురించి బడ్జెట్‌లో మాట్లాడలేదు. సహజంగానే వారికి ఎలాంటి మొత్తాన్ని కేటాయించలేదు. ఎవరి ప్రయోజనాల కోసం వారు ఇలా చేస్తున్నారు అనేది ప్రశ్న.
యూనివర్శిటీ విద్యలో ఒక్కో యూనివర్సిటీ అభివృద్ధికి కనీసం రూ.500 కోట్లు కేటాయించకుండా చాలా తక్కువ మొత్తాలను ప్రభుత్వం కేటాయించింది: కాకతీయ యూనివర్సిటీకి రూ.40 కోట్లు, మహాత్మాగాంధీ యూనివర్సిటీకి రూ.35 కోట్లు, పాలమూరు యూనివర్సిటీకి రూ.35 కోట్లు, తెలంగాణ యూనివర్సిటీకి రూ.25 కోట్లు. ఈ యూనివర్సిటీల మనుగడ కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేటాయించిన నిధులు ఖర్చు చేయలేదని విమర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25లో ఉన్నత విద్యకు డెవలప్‌మెంట్ కింద రూ.617 కోట్లు కేటాయిస్తే నిజంగా రూ.46 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, అది ఏడు శాతం కూడా లేదని విశ్లేషించారు.
ఈ నేపథ్యంలో విద్యా రంగ ప్రాధాన్యాలపై అసెంబ్లీలో చర్చించి అవగాహన కల్పించాలని, విద్యారంగానికి కనీసం 15 శాతానికి కేటాయింపులు పెంచాలని తెలంగాణ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ డిమాండ్ చేసింది.




