
హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాటర్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ అశోక్‌రెడ్డి ఆదివారం హిమాయత్ సాగర్ జలాశయాన్ని సందర్శించి వరద సన్నద్ధత చర్యలు, కార్యాచరణ ప్రణాళికలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్భంగా రిజర్వాయర్ భద్రతా ప్రమాణాలు, కార్యాచరణ సంసిద్ధత, వివిధ శాఖల మధ్య సమన్వయ వ్యవస్థలు, వరద నిర్వహణకు సంబంధించిన ప్రోటోకాల్‌లపై అధికారులు తీసుకుంటున్న చర్యలను ఎండీ సమీక్షించారు.
రుతుపవనాల ఇన్ ఫ్లో ప్రారంభమైన నేపథ్యంలో రిజర్వాయర్లలో నీటి మట్టాలు, పరివాహక ప్రాంతాల నుంచి వచ్చే ఇన్ ఫ్లోలు, నీటి నాణ్యతకు సంబంధించిన టర్బిడిటీ స్థాయిలను 24 గంటల పాటు నిరంతరం పర్యవేక్షించాలని ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
హిమాయత్ సాగర్ జలాశయానికి 800 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఉస్మాన్ సాగర్ జలాశయానికి కూడా ప్రవాహాలు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. రిజర్వాయర్ల నిర్మాణ భద్రతను అత్యున్నత స్థాయిలో నిర్వహించాలని, దిగువ ప్రాంతాల్లో వరద నిర్వహణను సమర్ధవంతంగా నిర్వహించేందుకు రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ శాఖలతో నిరంతరం సమన్వయం పాటించాలని ఎండీ ఆదేశించారు.




