
హనుమకొండ: ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి రూ.1000 కోట్లు మంజూరు చేసినట్లే కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి అవిభక్త జిల్లాలోని ప్రజాప్రతినిధులంతా సమష్టిగా కృషి చేస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.
విశ్రాంత ఆచార్యుల సంఘం (కూర్టా), రిటైర్డ్ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రూ.1000 కోట్లు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. కాకతీయ యూనివర్సిటీకి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ఉత్తర తెలంగాణ విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలను బలోపేతం చేయాలని రిటైర్డ్ ప్రొఫెసర్లు, ఎన్జీవో ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలోని యూనివర్సిటీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ పెన్షనర్లకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో చొరవ చూపిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సమష్టిగా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.




