
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో నిర్మాణ వైఫల్యాలు నాసిరకం నిర్మాణాలు, ఆమోదించిన డిజైన్‌లో ఇష్టానుసారం అవకతవకలు, అన్నింటికీ మించి కాంట్రాక్టర్-రాజకీయ సంబంధ బాంధవ్యాలే కారణమని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఆరోపించారు.
కాళేశ్వరం కాంట్రాక్టర్ల నుంచి బీఆర్‌ఎస్ ద్వారా రూ.1,400 కోట్లు అందాయని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కే కవిత చేసిన ఆరోపణను ఉటంకిస్తూ.. మేడిగడ్డ ఎందుకు కూలిపోయిందో, అన్నారం, సుందిళ్ల కూడా ఎందుకు ప్రమాదకర స్థితిలో ఉన్నాయో ఆ ప్రాజెక్టు వెనుక ఉన్న కథనాలను వివరించారు.
డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్)లో ఆమోదించబడిన ప్రదేశానికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో కాళేశ్వరం బ్యారేజీలు రెండు నిర్మించారని, ఇది ప్రాజెక్టు నిర్మాణ సమగ్రతను ప్రమాదంలో పడేసే ఇంజినీరింగ్ వైపరీత్యాలకు ఇది స్పష్టమైన ఉదాహరణ అని మంత్రి ఆరోపించారు.
కాళేశ్వరం కాంట్రాక్టర్ల నుంచి రూ.1,400 కోట్లు అందాయని మాజీ ముఖ్యమంత్రి కూతురు చెప్పినప్పుడు తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ నాయకత్వం వివరణ ఇచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
పాలక పక్షానికి, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లకు మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలు ఇంజనీరింగ్ ప్రమాణాలు, నిర్మాణ నాణ్యత మరియు ప్రజల భద్రతకు విఘాతం కలిగించాయని ఆయన ఆరోపించారు.
“క్విడ్ ప్రోకో ప్రాతిపదికన కాంట్రాక్టర్ల నుండి డబ్బు అందుకున్నట్లు ఆరోపణలు వచ్చినప్పుడు, ప్రజలు ఎలాంటి నాణ్యతతో నిర్మాణాన్ని ఆశించగలరు?” అని మంత్రి ప్రశ్నించారు.
మేడిగడ్డ బ్యారేజీ పాక్షికంగా కుప్పకూలడం, అన్నారం, సుందిళ్ల వద్ద నిర్మాణ, పునాది సంబంధిత సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కవిత ఆరోపణకు ప్రాధాన్యత సంతరించుకుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నాసిరకం డిజైన్, నాసిరకం నిర్మాణం, పర్యవేక్షణ బలహీనత, సౌండ్ ఇంజినీరింగ్ సూత్రాలను విస్మరించడమే మేడిగడ్డ వైఫల్యం, మిగతా రెండు బ్యారేజీల ప్రమాదకర పరిస్థితి అని ఆరోపించారు.




