
నాగర్ కర్నూల్: త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేసేందుకు జిల్లా ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అమ్రాబాద్ మండలం మున్ననూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. ఎన్నికల సమయంలో అక్రమంగా నగదు, మద్యం, ఇతర నిషేధిత వస్తువుల రవాణా జరిగే అవకాశం ఉందని, విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వాహనాలు, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలని సిబ్బందిని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఎటువంటి రవాణా జరగకుండా చూసుకోవాలని ఎస్పీ ఉద్ఘాటించారు. ఎలాంటి సడలింపులు లేకుండా కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగించాలని ఆయన ఆదేశించారు.




