
ఖానాపూర్: నిర్మల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందేలా చూడాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మల్ పట్టణంలో కలెక్టర్ సమీక్షలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం గుడిసెలు వేసుకుని నివసిస్తున్న అర్హులైన పేద కుటుంబాలకు రెండో దశలో ఇందిరమ్మ ఇళ్లను పారదర్శకంగా మంజూరు చేయాలని కోరారు. మండలాల వారీగా ఇళ్ల నిర్మాణాల పురోగతిని మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో (ఎంపీడీఓ) సమీక్షించారు.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులకు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందించి నిర్మాణ పనులు నిలిచిపోకుండా చూడాలని సూచించారు. ప్రతి ఇంటి నుంచి రోజూ చెత్త సేకరణ తప్పనిసరి చేస్తూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.



